24, నవంబర్ 2011, గురువారం

వేగు చుక్క మొలిసింది
వేకువ పొడసూపింది
తూరుపు తెలతెల వారకముందే
కాలం మాటేసింది.. నా కళ్లను కాటేసింది..
వేగు చుక్క
జీవితమంటే కల కాదు..
అది కవులు రచించే కథకాదు 2 ఆ..ఆ..
కనుమరుగైనది సిరికాదు..
అది మనదని తలుచుట సరికాదు..
కుడి ఎడమైతే పొరపాటు లేదను
నానుడి సత్యం సరికాదు
ఇది అందరికర్ధం కాదు.. ఓ.. ఓ
వేగు చుక్క
ఎండిన మల్లెకు వెలలేదు..
మండే గుండెకుచలిలేదు.. 2
మంచిని మించిన జత లేదు
విధివంచన కన్నా వెత లేదు
మనసే మనిషికి చిరుచేదయితే
మనుగడకర్ధం లేదు
ిఇది అందరికర్ధం కాదు..
వేగు చుక్క

Rachabandalo Akali Kekalu.mpg

4, జూన్ 2011, శనివారం

ప్రియరాగాలు 6 మల్లెపూలు

ఎ.జనార్ధన్
సినీగీతాల స్వర సంగమం ప్రియరాగాల కు స్వాగతం.. వేసవిలో ఉష్ణతాపం ఊపిరాడనివ్వదు..అందుకే సాయంకాలపు చల్లదనం కోసం ఎదురు చూస్తరు.. వేసవిలో కూడా ఉష్ణతాపాన్ని మరిపించేవి మల్లెపూలు.. మంచు ముత్యాల్లా చల్లగా ఉండి, నునునిగ్గులు తేలే మల్లెమొగ్గలు మనసు హాయిని ఆహ్లాదాన్ని కలిగిస్తయి. మల్లెపూల నేపద్యంలో వచ్చిన రాగాలే నేటి మన ప్రియరాగాలు.
బ్యాంగ్
యాంకర్ 1
సాయంకాలపు సమయంలో.. ఆరుబయట మంచం వేసుకొని పడుకుంటే మల్లెపందిరిని తాకి వచ్చే మనోహర పరిమళం మనసుకు ఉల్లాసాన్నిస్తది. పగలంతా వేసవి తాపానికి విసిగి పోయినా.. సంధ్యవేళ మల్లెల వాన మనసుకు హాయినిస్తది.
మంచుకురిసే వేళలో (అభినందన)
యాంకర్ 2
జాబిలి వెన్నెలను ఒళ్లంతా నింపుకొని సాయంకాలపు చందమామను వెక్కింరించేంత అందంగా ముస్తాబయితది మల్లెపూవు. ఒక్కొక్క రేకు విచ్చుకుంటుంటే శశికళల్లా మల్లెల అందం మరింత పరిమళిస్తది. మల్లెపరిమళాన్ని పులుముకున్న పైరగాలి మనసులను మత్తుగా విరహలోకాలాకు విసిరేస్తది.
మల్లెల వానా మల్లెల వానా నాలోనా..(రాజా)
యాంకర్ 3
కొత్తగా పరువానికొచ్చిన పడుచు పిల్ల తనకు కాబోయే వరుడెవరో.. ఎలా ఉంటడో తెలుసుకోవాలని తెగ ఉబలాట పడుతది… పడుచు పిల్లకు ప్రకృతే నేస్తం.. పచ్చని చెట్ల నడుమ తెల్లగా మంచు ముత్యాల్లా మెరిసే మల్లెపూలే మనసు తెలిసిన నేస్తాలు.. అందుకే కాబోయే తన వాడెవడో చెప్పమని బతిమాలుకుంటది..

సిరిమల్లె పూవా(పదారేళ్లవయసు)
యాంకర్ 4
పండు వెన్నెలకు.. మల్లెపూలకు ఏదో తెలియని అనుబంధం ఉన్నదనిపిస్తది. పిండారబోసినట్టుండే వెండి వెన్నెల్లో మల్లెపూల పరిమళం మరింత మధురంగా ఉంటది.. ఆ సిరిమల్లెల కాస్త విరిజల్లు కురింసిందా.. మల్లెపూలు వజ్రాలను అలంకరించుకున్నంత అందంగా ఉంటయి. అందుకే బార్యా భర్తల అన్యోన్య దాంపత్యం కూడా సిరిమల్లి పై విరిజల్లులా ఉండాలనే కోరుకుంటరు..
(సిరిమల్లి నీవే..విరిజల్లు నేనే)(పంతులమ్మ)
యాంకర్ 5
తెల్లచీర.. పాలగ్లాసు.. వీటితో బాలు మల్లెపూలు ఉంటే.. ఆ రేయంతా శివరాతిరే.. భారతీయ సంప్రదాయంలో మొదటి రాత్రికి మల్లెపూలకు విడదీయరాని అనుబంధం ఉంది. ఎక్కడ మల్లె పరిమళం వచ్చినా ఆ మధుర జ్ఞాపకం ఓ క్షణం కళ్లముందు కదలాడి పెదాలపై చిరునవ్వు తెప్పిస్తది.
(మంచమేసి దుప్పటేసి..)(కొండవీటి రాజా)
యాంకర్ 6
ఊహల ఊయ్యాలలో ఊగిపోయే కన్నెపిల్ల కలలనిండా తనకు కాబోయే సరిజోడు రూపురేఖలే.. మదినిండా కోరికలు తుమ్మెదల్లా ఝుమ్మంటుంటే..తలపుల్లో దాగిన తుంటరి ఆలోచనలేవో చిచ్చరపిడుగలై మదిని రగిలిస్తయి.
(తలలోన తురుముకున్న తుంటరి మల్లె దగ్గర్నుంచి)(తొలిసారి మిమ్మల్ని)
యాంకర్ 7
అమ్మాయిని మల్లెపువ్వుతో పోల్చే రసిక కవులకు కూడా తక్కవేం లేదు. మల్లెపువ్వు, అమ్మాయి నవ్వు ఎంతందంగా ఉంటయో.. మూతి ముడిచిన అమ్మాయిని కాస్త మల్లెపువ్వా అంటే చాలు.. మల్లె విరిసినట్టు విరగబడి నవ్వేస్తది.
(మల్లెపువ్వా .. మజాల నవ్వా..)(రావోయి.. చందమామ)
ఎండ్ యాంకర్
చూశారుగా మల్లెపూల మధురగీతాలు.. వచ్చేవారం మరో మంచి కాన్సెప్ట్ తో మరిన్ని ప్రియరాగాలు చూద్దాం. దిసీజ్ ప్రవలిక.. సైనింగ్ ఆఫ్

31, మే 2011, మంగళవారం

ప్రియ రాగాలు 5 నవ్వు

ఎ.జనార్దన్
మనసును మురిపించే మధుర స్వరాల మధువనం ప్రియరాగాలు కు స్వాగతం. చిరునవ్వు మనిషి మొహంలో కాంతి నింపుతది. నవ్వుమొహం చూస్తే ఎదుటివాళ్లకు కూడా నవ్వాలనిపిస్తది. అవును నవ్వుకున్న సమ్మోహన శక్తి అటువంటిది. అందుకే సినీకవులంతా నవ్వుల పై నానా రకాల పాటలు కట్టిన్రు. నవ్వుల పువ్వులే నేటి మన ప్రియరాగాలు.
బ్యాంగ్ ( పువ్వల్లె నవ్వుల్ నవ్వుల్) బ్యాంగ్ టైటిల్ (ఒక పువ్వు ఒక నవ్వు)
యాంకర్ 1
అందమైన చిరునవ్వు ఒక వరం.. ఆ నవ్వులు మువ్వ మోతలై సందడి చేస్తే.. పడుచు గుండె పరవళ్లు తొక్కుతది. నవ్వు ఒక మనుషులకే సొంతం అనుకుంటం.. కానీ చిరునవ్వలు చిందించడం పువ్వులకు తెలుసు.. జోడున్న గువ్వలకు తెలుసు..ఆ నవ్వే ప్రియుడి గుండెలను పిండేస్తది.. గల్లుమనే నవ్వులు జిల్లుమని లాగేస్తుంటే మువ్వలా నవ్వకలా ముద్దమందారమా అని మురిపెంగా పిలుచుకుంటడు..
(మువ్వలా నవ్వకలా..)(పౌర్ణమి)
యాంకర్ 2
అమ్మాయి చిరునవ్వు నవ్వితే..అరవిరిసిన పువ్వులా ఉంటది.. ఆ ఆనంద పరిమళాలను ఆస్వాదించే ప్రియుడు .. ప్రియురాలి పెదవుల పై చిరునవ్వు శాశ్వతంగా ఉండాలని కోరుకుంటడు. ఆ చెరగని చిరుదరహాసం కోసం ఏదైనా చేయాలని తపన పడతడు..
(ఒక పువ్వు ఒక నవ్వు)(జై బోలో తెలంగాణ)
చేంజోవర్
(నీ నవ్వే చాలు బంతీ చేమంతి)(పెద్దరికం)
యాంకర్ 3
ఇష్టసఖి చిరు నవ్వు నవ్వితే ఆ నవ్వుల్లో చందమామ వెన్నెల కురుస్తది. ఆ వెన్నెల మొగిలి రేకుల పరిమళంలా మత్తుగుంటది. నాద స్వరంలా నాట్యమాడిస్తది. కనులు మూసినా కనులు తెరిచినా.. చీకట్లో కూడా ఆ చిరునవ్వే పలకరిస్తది.
(నీ నవ్వే నాద స్వరమై)(దేవి)
చేంజోవర్
(ఓ నవ్వు చాలు)( నువ్వు నాకు నచ్చావ్)
యాంకర్ 4
పువ్వులకు.. మువ్వలకు.. అమ్మాయి నవ్వులకు ఏదో సారూప్యం ఉందంటరు కవులు.. పువ్వులు విరబూస్తే ఆ ప్రాంతమంతా పరిమళం.. మువ్వలు సవ్వడి చేస్తే ఏదో తెలియని అనుభూతి... అమ్మాయి కిలా కిలా నవ్విందా చెన్నై సూపర్ స్టారైనా సుడిగాలై వాలాల్సిందే.
(మువ్వల్లే నవ్వుల్ నవ్వుల్)( శివాజి)
చేంజోవర్
(నీ నవ్వు చెప్పింది)(అంతం)
యాంకర్ 5
అసలు పువ్వులకు నవ్వలు నేర్పింది అమ్మాయిలే నంటడు ఓ ప్రియుడు.. అందుకే అమ్మాయిలోని సగం అందాన్ని పువ్వులు దోచుకున్నయట..అందుకే.. తన ప్రియురాలి నవ్వులను అప్పడిగినా పువ్వులకు ఇవ్వద్దంటడు.
(నీ నవ్వుల తెల్లదనాన్ని)(ఆది)
యాంకర్ 6
పడుచుపిల్ల నవ్వులు .. మల్లెలను మరిపిస్తయట.. అంతే కాదు వానవిల్లు కూడా అమ్మాయి చిరునవ్వు కంటే పెద్ద అందంగా ఉండదంటడు ప్రియుడు. హరివిల్లులో ఉండే సప్తవర్ణాల సొగసులు తన ప్రేయసి నవ్వల్లో పొదిగి ఉన్నయని మురిసిపోతడు.
(నీ నవ్వులే వెన్నెలని)(మల్లీశ్వరి)
చేంజోవర్
(సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా..)(చిరునవ్వు)..
యాంకర్ 7
ఒకసారి రోడ్డు పక్కన అబ్బాయిల గుంపును చూసి అమ్మాయి నవ్విందట. అందులో అబ్బాయిలంతా నన్ను చూసి నవ్విందంటే నన్ను చూసి నవ్విందని వాదులాడుకున్నరట. ఆఖరుకు ఆమెనే అడుగుదామని వెళ్లి ఎవర్ని చూసి నవ్వావో చెప్పమని అడిగిన్రట. అప్పుడా అమ్మాయి అరనవ్వులు నవ్వుతూ మీలో ఎవరు తెలివి తక్కువ వాళ్లో వాళ్లను చూసి నవ్విన్నని సమాధానం చెప్పిందట. అప్పుడు అందరూ నేను తెలివి తక్కువ వాణ్ణంటే నేను తెలివి తక్కువ వాణ్ణని కొట్లాడుకున్నరట. అవును మరి అమ్మాయి అర నవ్వు నవ్వితే కుర్రాళ్లు మతి తప్పి మంచాన పడతరట..
(అమ్మాయే సన్నగా.. అర నవ్వే నవ్వితే.)(ఖుషి)
చేంజోవర్
(నవ్వింది మల్లె చెండు)(అభిలాష)
ఎండ్ యాంకర్
చూశారుగా మనసు మెచ్చే మన ప్రియరాగాలు..వచ్చే వారం మరో మంచి కాన్సెప్ట్ తో మరిన్ని ప్రియరాగాలతో వస్తా.. దిసీజ్ ప్రవలిక సైనింగ్ ఆఫ్..
బ్రేక్
మధురగీతాల మధువనం ప్రియరాగాలలో స్మాల్ బ్రేక్
ప్రియరాగాలకు తిరిగి స్వాగతం.

ప్రియ రాగాలు 4 లంగా ఓణి2

ఎ.జనార్దన్
మనసును మురిపించే మధుర స్వరాల మధువనం ప్రియరాగాలు కు స్వాగతం. భారతీయ సంప్రదాయంలో లంగా, ఓణిది అత్యంత అందమైన పాత్రం. యవ్వనంలోకి అడుగుపెట్టే ప్రతి ఆడపిల్ల సౌందర్యాన్ని, పరువాల సొగసులను అద్దినట్టు చూపించేది లంగా ఓణి.. అందుకే మన సినిమాల్లో లంగా ఓణికి పెద్దపీఠ వేసిన్రు. లంగా ఓణి నేపద్యంలో వచ్చిన రాగాలే నేటి ప్రియరాగాలు
బ్యాంగ్
యాంకర్ 1
పల్లెటూరి పిల్లకైనా ప్రపంచ సుందరికైనా తోలిసారి ఓణి వేస్తే బుగ్గలపై సిగ్గులు తేలాల్సిందే.. ఆ సిగ్గుల మొగ్గ అందానికే అసూయ పుట్టేంత అందంగా ఉంటదంటే నమ్మండి.. అందునా విశ్వసుందరి ఓణీ వేస్తే ప్రకృతికే అసూయ పుడుతుందేమో..
పలికే గోరింకా..(ప్రియురాలు పిలిచింది)
వాయిస్
(స్టార్టింగ్)
కురులన్నీ విరులై గాలికి తూలనాడుతుంటే.. ఎండుగడ్డి వర్ణమంతా పులుముకున్న ఓణీ.. విశ్వసుందరి సొగసును సొంపుగా చూపెడుతది. పలికే గొరింకలా ప్రియుడు తన దరి చేరాలని మదిలో కోరికను బయట పెడతది..
యాంకర్ 2
చందమామ కూడా నల్లని ఓణీ వేసుకొని చక్కనమ్మగా మరిందట.. అవును మరి ఆ నల్లని కుందేలు కూడా వెన్నెల సొగసు నింపుకొని నేల పైకి వచ్చి పైటేస్తే ఇదిగో ఇలా చెంగు చెంగున ఎగిరే చెన్నై లేడి పిల్లలా ఉంటది..
(చంద్రుళ్లో ఉండే కుందేలు)(నువ్వొస్తానంటే నేనొద్దంటానా)
వాయిస్ (స్టార్టింగ్)
నేలమ్మ ఎదపై పసిరిక మొక్కలన్నీ పచ్చని పైటలా పైరగాలికి కదలాడుతయి. కనుచూపు మేరలో కనిపించే అందాన్నంతా ఓణీ తనలోకి ఒంపుకొని పడుచు అందానికి పచ్చని వన్నె దిద్దింది.
యాంకర్ 3
పెళ్లీడుకొచ్చిన పడుచు పిల్ల కాబోయే వరుడెలా ఉంటాడోనని ఊహల్లో విహరిస్తది. ఆ ఊహలకు రూపాన్నిచ్చేది ఓణీయే.. ఆ మన్మధ రూపం కళ్లల్లో కదలాడుతుంటే చక్కిలిగిలి పెట్టి చెక్కిళ్లను ఎరిపెక్కించేది ఓణియే.. ఓళ్లంతా కళ్లు చేసుకొని ప్రియుడి కోసం వేచి చూసే అమ్మాయి ఎద పై పైట ఒక్క క్షణం ఆగనంటదట..
(నువ్వేం మాయ చేశావో గానీ)
వాయిస్
నీలినింగి అందాలన్నీ ఒంపుకొని పైటలా పై ఎదను తాకితే అది ఆకాశాన్నే వెక్కింరించేంత అందంగా ఉంటదట. చిరుగాలికి పైఎద కదిలిందా గుండె ఝల్లుమంటది.. మనసు గొల్లుమంటది.. శీతలపవనంలో కూడా చిరు చెమటలు పట్టిస్తది ఓణి..
చేంజోవర్
(మాఘమాసం ఎప్పుడొస్తుందో)(ఎగిరే పావురమా)
యాంకర్ 4
అమ్మాయిని పైటలో చూస్తే అబ్బాయిల గుండెల్లో గుబులు రేగుతది. మదిలో విరిసిన తలపులు..వలపులు.. వయసులో దాగిన కోరికలను రివ్వున రమ్మని పిలుస్తయి. ఆ పిలుపు నందుకున్న అమ్మాయి అందం ఓణీ వేసిన దీపావళే..
(పందెం కోడి) ఓణీ వేసిన దీ పావళి పాట..
వాయిస్
ఆరడుగుల అందగాడైనా ఆరు మూరల ఓణీని చూసి నిద్రని మరిచిపోవలసిందే. ఒంపు సొంపుల వయ్యారాలు నయగారాలను వెక్కిరిస్తుంటే.. తన గారాల పట్టిని మచ్చిక చేసుకొని.. అచ్చిక..బుచ్చికలాడి..వెచ్చని ముచ్చట తీర్చుకోవాలని ఏ ప్రేమికుడు ఆశపడడు..
చేంజోవర్ (చందమామ) రేగు ముల్లు సాంగ్
వాయిస్
ముట్టుకుంటే కందిపోయే చిన్నదాని..కందిరీగ నడుమును చుట్టే ఓణీ, పొత్తిళ్ల పై కుచ్చిళ్లు పొగరుగా మరిగిపోతుంటే.. కౌగిళ్ల కాపడం తప్పదని హెచ్చరిస్తది పరికిణి.
యాంకర్ 5
పండువెన్నెల పైటై పరుచుకుంటే .. అమ్మాయి ఎదలో కోరికలన్నీ జలపాతాల్లా జలజలా రాలుతుంటయి.. ఆ కోరికల హోరు పూలజల్లులై పొదరింట్లోకి లాగుతుంటే .. మనసు వేణువులో వాయువై సరాగాలు అల్లుకుంటది.. వేణుగానమే ప్రాణమని సంబరపడతది..
(పండువన్నెల్లో నీ వేణుగానం పాట)(జానకి వెడ్స్ శ్రీరాం)
చేంజోవర్
(పూసింది పూసింది పున్నాగ)(సీతారామయ్య గారి మనుమరాలు)
యాంకర్ 6
కన్నెపిల్ల అందాలను అద్దినట్టు చూపించాలంటే అది లంగా ఓణికే సాధ్యం. ప్రకృతి అందాల నడుమ నడుమొంపులను చూపి అబ్బాయిల పెదాలపై కెంపులు పూయించే గడసరి ఓణి.
కోరమీసం మొలిచిన కుర్రవాడెవడైనా ఓణీ వేసిన నెరజాణను చూస్తే నిలవలేనంటడు..
(నీలపురి గాజుల ఓ నీల వేణి)(మహాత్మ)
చేంజోవర్
రాను రానంటూనే చిన్నదో.. పాట(జయం)
యాంకర్ 7
ఉమ్మడి కుటుంబాలలో బావా మరదళ్లు అన్యోన్యంగా ఉంటరు. చిలిపి కొట్లాటలు, చిరు సయ్యాటలు ఆ అనుబంధాన్ని మరింత పెంచుతయి. అప్పటివరకు పరికిణిలో కనిపించిన మరదలు పిల్ల.. కొత్త సొగసులేవో సొంతం చేసుకుంటే మురిపాలన్నీ తనకే సొంతమని మురిసిపోతడు
(చూశాను ఎన్నడో పరికిణీలో నుంచి)(రాళ్లల్లో ఇసకల్లో పాట)
చేంజోవర్
(ఎలే ఎలే మరదలా)(అన్నమయ్య)
ఎండ్ యాంకర్
చూశారుగా మనసు మెచ్చే మన ప్రియరాగాలు. వచ్చే వారం మరో మంచి టాపిక్ తో మరిన్ని ప్రియరాగాలు మీకోసం తెస్తా.. దిసీజ్ ప్రవలిక సైనింగ్ ఆఫ్..
బ్రేక్
ప్రియరాగాలకు చిన్న విరామం… మనసును మురిపించే మధురగీతాల ప్రియరాగాలకు స్వల్ప విరామం..
ప్రియరాగాలకు తిరిగి స్వాగతం..

ప్రియ రాగాలు 3 విరహగీతాలు

విరహగీతాలు
ఇంట్రో యాంకర్
మనసులో మనసుగా.. వీడని తోడుగా ..అనుక్షణం నీడగా ఉండే మనిషి దూరమైతే.. ఆ బాధ మాటల్లో వర్ణించలేం.. అదో తీయని బాధ..ఆ బాధనే విరహమంటరు.. మన సినిమాల్లో విరహగీతాలకు ఆదరణ ఎక్కువ. ఆ విరహగీతాలే నేటి మన ప్రయరాగాలు..
బ్యాంగ్
యాంకర్ 1
మనసు కలిసిన మనిషి.. గుండెకు చేరువై.. మదినిండా ఆమె జ్ఞాపకాలే ముసురు కున్నంక.. ప్రేమగా పిలిచే ఆ పిలుపు దూరమైనపుడు.. చల్లని స్పర్శ అందకుండా పోయినపడు. మదినిండా మంటలే.. ఎదనిండా విరహవేదనే..
ప్రేమా..ప్రేమా విరహం నీ పేరా..
యాంకర్ 2
ఆ జంట మనసిచ్చి పుచ్చుకున్నారు.. కానీ చూసుకునే ఛాన్సే లేదు.. మాటలన్నీ టాక్ టైం తోనే.. మళ్లీ కలుసుకోవాలన్నీ కోరిక కోరికలాగే ఉంటది.. మాటలు మనసులే కలుసుకుంటాయి.. ఒక్కచోట చేరి ఊసులాడుకోవాలన్న కోరిక.. కోరికలానే మిగిలపోతది.. క్షణక్షణం ప్రాణం విలవిలలాడుతుంటది.
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా..(గోదావరి)
యాంకర్ 3
తను ప్రేమించిన అమ్మాయి దూరమైతే.. కనిపించే ప్రతి ఓణీ తన ప్రియురాలిదేనా అన్నంత భ్రమలో ఉంటడు. ఏకాంతంలో మాట్లాడుకుంటడు.. ముసిముసిగా నవ్వుకుంటడు.. తాను పక్కనే ఉన్నట్టు పగటి కలలు కంటడు.
ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది.(నువ్వే కావాలి)
యాంకర్ 4
తాను ప్రేమించిన అమ్మాయి ... దూరమైనపుడు ప్రియుడు విరహవేదనతో రగిలపోతడు.. అటువంటిది తన సొంతమనుకున్న అమ్మాయి.. మరొకరి సొంతమవుతున్నపుడు.. చిరుగాలి కూడా చెమట పుట్టిస్తది. చల్లని వెన్నెల కూడా మంటలు రేపుతది..
ఇది తొలిరాత్రి కదలని రాత్రి.(మజ్ను)
యాంకర్ 5
విడిపోని జంట ఒక్కసారే వేరయితే.. గడియకూడా విడిచి ఉండలేని ప్రేమికులను ఏదో శాపం విడగొడితే.. ఆ విరహవేదన చల్లార్చుకోవాలంటే జ్ఞాపకాలే మందు.. తీపిగుర్తుల్లోనే జీవితం.. ప్రియా ఎక్కడున్నవ్.. ఏం చేస్తున్నవ్‌.. ఈ వేళలో నీవు ఏంచేస్తున్నవ్‌ అంటూ పాడుకొని తృప్తి పడటమే.
ఈ వేళలోనీవు (గులాబి)
యాంకర్ 6
ఆమె అంటే అతనికి ప్రాణం.. అతనంటే ఆమెకు పంచప్రాణాలు.. కాలం చేసిన గాయం ఇద్దరినీ విడగొట్టింది.. కలుసుకునే దారి కరువయింది.. ఎన్నెండ్లకో గానీ తనను కలిసే అవకాశం దొరకదు. ఆ అవకాశం కోసం ఆలానే నిరీక్షిస్తూ.. పాడే పాట గుండె లోతులను తాకుతది.
చుక్కల్లే తోచావే (నిరీక్షణ పాతది)
యాంకర్ 7
కలిసి జీవితాన్ని పంచుకున్న భార్యాభర్తలను విధి వేరు చేస్తే.. ఇద్దరిలో ఒకరు కాలం చేస్తే..బోయవాడి బాణానికి రాలిన గోరింకలా జంట బాసిపోతే.. ఆమె శేష జీవితమంతా అతని జ్ఞాపకాలే..
అసలేం గుర్తుకు రాదు..(అంతఃపురం)
చేంజోవర్
ఓ మనసా ..ఓ మనసా..(భద్ర)

యాంకర్ 8
చిలిపి నవ్వులు.. కొంటె చేష్టలు ప్రేమగా మరి ఇద్దరినీ ఒక్కటి చేస్తయి.. ఆ ఇద్దరు జీవితాన్ని కలిసి పంచుకుందామని కలలు కంటరు.. సరిగ్గా అప్పుడే అమ్మాయి ఇక తనకు దక్కదన్న చేదు నిజం తెలిస్తే.. ఆ బాధ వర్ణనాతీతం.. అసలు ప్రేమ అనే పదమే వినాలని ఉండదు. ప్రేమనేదే లేదని విరహగీతం పాడుకుంటరు.
ప్రేమ లేదని ప్రేమించ రాదని(అభినందన)
చేంజోవర్
ఎవరి కోసం..ఎవరి కోసం( ప్రేమనగర్ )
యాంకర్ 9
చేతిలో చెయ్యేసుకుని చెట్టపట్టాలేసుకున్న కుర్ర జంటను పేరెంట్స్ విడదీస్తే.. ప్రపంచం మొత్తం మునిగినంత బాధగా ఉంటది. సముద్ర మొత్తం తన కళ్లలో నింపుకొని కన్నీటి ఊటలతో చెక్కిళ్లను తడుపుతది.
ప్రపంచమంతా నా కన్నుల్లో (నువ్వే నువ్వే)
చేంజ్‌ ఓవర్
చెలియా.. చెలియా..(ఇడియట్)
యాంకర్ 10
ఆమె.. అతను తన సొత్తే అనుకుంటది.. అతను కూడా ఆమే తన సర్వస్వం అనుకుంటడు.. కానీ చెప్పడు.. పెళ్లంటే వాయిదా వేస్తడు.. పైగా మరో అమ్మాయిని చేసుకోబొతున్నానంటూ ఆట పట్టిస్తడు. అది నిజమని.. తట్టుకోలేక తొందరపాటు తనంతో శాశ్వతంగా దూరమైతే.. మిగిలిన ఆ ప్రేమపక్షి బతుకంతా ఆమె తలపులతోనే గడిపేస్తడు..
జాబిల్లి కోసం ఆకాశమల్లే (మంచి మనుసులు)
చేంజోవర్
ఓ..చెలి అనార్కలి..(సింధూరం)
యాంకర్ 11
తన తోడు.. తనలో సగం.. దూరమై ఎన్నో రోజులవుతది.. వస్తాడన్న కబురు వచ్చింది.. మళ్లీ అతని ఆత్మీయస్పర్శ దొరకబోతుందన్న ఆనందం క్షణం కూడా నిలవనీయదు. ఆ నాలుగు రోజులు యుగాలుగా గడుస్తయి..ఆ ఆఖరి రోజు అమ్మాయి పాడే పాట అత్యంత మధురం.. ఆ మనసు పాడే పాట అపురూపం
వస్తాడు నారాజు ఈ రోజు (అల్లూరి సీతారామ రాజు)
చేంజోవర్
అచ్చం ఇలాంటి విరహ వేదనే అతను అనుభవిస్తే.. ఇదిగో ఇలా ఆమె జ్ఞాపకాలతో గడిపేస్తడు. ప్రతి క్షణాన్ని ఆ మధురానుభూతులతోనే గడిపుతడు.
నా చెలి రోజావే (రోజా)
యాంకర్ 12
తనే సర్వస్వం అనుకొన్నడు. ఆమే తన జీవితం అనుకొన్నడు. పాపం తనను ఒప్పించడానికి కష్టపడ్డడు..కానీ తాను ఎన్నో రోజులు బతకనని తెలుసుకున్న ఆ ప్రియుడు పడే మరణ వేదన మాటలకందనిది.
ఆగదు ఏ నిమిషం నీకోసం(ప్రేమాభిషేకం)పాట.. హృదయం అద్దమని పగిలితే అతకదని..దగ్గర్నుంచి వేసుకోవాలి.
నిన్ను తలచి మైమరచా(విచిత్ర సోదరులు)
పెళ్లి సంబంధం కుదిరింది.. అందులోనూ కాబోయే వరుడు అందగాడు.. చుక్కల్లో చంద్రుడు.. ఇక ఆ అమ్మాయి మనసు మనసులో ఉండదు.. ఎప్పుడెపుడు పెళ్లి ముహూర్తం దగ్గర పడుతదా అని ఎదురు చూస్తది. మనసునిండా పెళ్లి మంత్రాలే నింపుకుంటది.. ఆ ఘడియ వచ్చే వరకు లేఖలే ఆమె ఆకలిని తీరుస్తయి.
మాపెరటి జాంచెట్టు.(పెళ్లి సందడి)
ఇవీ ఈ వారం ప్రియరాగాలు.. మరిన్ని మంచి స్వరాలతో వచ్చేవారం మళ్లీ కలుసుకుందాం.. దిసీజ్ ప్రవళిక సైనింగ్ ఆఫ్..
బ్రేక్
మరిన్ని విరహగీతాలు చూసేముందు ప్రియరాగాల్లో చిన్న విరామం..
ప్రియరాగాల్లో స్వల్ప విరామం..
వెల్ కం బ్యాక్.. ప్రియరాగాలకు తిరిగి స్వాగతం..మదిని దోచే ప్రియరాగాలకు తిరిగి స్వాగతం.

ప్రియ రాగాలు 2 పెళ్లి

ఎ.జనార్ధన్
ప్రియ రాగాలు పెళ్లి పాటలు
ఇంట్రో యాంకర్
మనుసుని మురిపించి మై మరిపించే ప్రియరాగాలు కార్యక్రమానికి స్వాగతం..
యాంకర్ 1
మనిషి తన జీవితంలో ఎన్నో సంబరాలు జరుపుకుంటడు.. అన్ని సంబరాల్లో అతి ముఖ్యమైంది.. జీవితాన్నే ఒక మలుపు తిప్పే వేడుక పెళ్లి.. పెళ్లి ఈ పదం వినగానే పులకించని మనసుండదు. మనిషుండడు. ఎందుకంటే మనిషి జీవితంలో ఎప్పటికీ గుర్తుండి పోయే ఓ మధుర జ్ఞాపకం పెళ్లి.. మన సినిమాల్లో పెళ్లి నేపద్యంలో ఆణి ముత్యాల్లాంటి పాటలు వచ్చినయి. ఆ పరిణయ పాటలే మన నేటి ప్రియ రాగాలు.
బ్యాంగ్..
యాంకర్ 2
పెళ్లంటే ఒక ఓ అపురూప సంఘటన.. ఓ మధుర భావన.. ఎన్నో రోజుల నిరీక్షణ ఫలితం.. జీవితంలో తొక్కబోయే కొత్తదారి.. ఏం.. పెళ్లికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు.. పెళ్లంటే..పందిళ్లు.. తాళాలు.. తలంబ్రాలేనా.. రెండు మనసులు ఒక్కటయి కొత్త జీవితానికి తొలి అడుగు వేసే వేదికా..మన కవులు పెళ్లికి చెప్పిన అర్ధం ఏంటో ఈ పాట చూస్తే తెలుస్తది.
(పెళ్లంటే పందిళ్లు, తాళాలు, తలంబ్రాలు.. మూడే ముళ్లు పాట)(త్రిశూలం)
యాంకర్ 3
పెళ్లి పదం చెబితే.. అమ్మాయిలు సిగ్గుల మొగ్గలవుతురు.. చెక్కిళ్లు ఎరుపెక్కి పెదవులు పగడాలవుతయి. ఆ సిగ్గుల దొంతరలను చూసిన జతగాళ్లు అమ్మాయిని పెట్టే అల్లరి అంతా ఇంతా కాదు.. ఆ అల్లరికి అమ్మాయి కళ్లలో వేయి కాంతుల వెలుగులు చిమ్ముతయి. ఆ అల్లరి ఒక తీయని అనుభవం.. ఆ అనుభవం ఒక మధుర జ్ఞాపకం..
(పెళ్లికల వచ్చేసిందే బామా)(ప్రేమించుకుందాం రా..)
యాంకర్ 4
పెళ్లికూతురు చెక్కిలి పై చుక్క పెట్టింది మొదలు.. పెళ్లిపీఠల పైకి తీసుకొచ్చేదాకా ఆడపడుచుల అల్లరి, అమ్మాయి స్వీట్ మెమరీస్ సిరీస్ లో పర్మినెంట్ గా ప్రింగ్ అయి ఉంటది. పెళ్లికూతురి జ్ఞాపకాల్లో పది కాలాల పాటు పదిలంగా ముద్రపడాలనో, లేక తమ సోపతికాడి వేడుకని దగ్గరుండి జరిపించాలని కోరికతోనో తోటి వయసు వారంతా అల్లరి చేస్తూ అప్పగింతల వరకు అంటిపెట్టుకొనే ఉంటరు. ఆ క్షణం తరువాత అమ్మాయి తమకు అంత దగ్గరగా దొరకడం అరుదు. అందుకే ఉన్న ప్రేమంతా ఒకేసారి ఒలకబోస్తరు.
(కొత్త పెళ్లి కూతురా రా రా..)/ బంగారు బొమ్మ రావేమే..
యాంకర్ 5
పెళ్లి కూతురుగా ముస్తాబు చేస్తే మనుషులే కాదు దేవతలక్కూడా చెక్కిళ్లపై సిగ్గుల నిగ్గులు తేల్తయట. వరుణ్ని ఓరగంట చూసి కళ్లతోనే కసిగా మనసు వీణను మీటుతరట. అవును అలా మోగిన వీణలే మాధవుణ్ణి పద్మావతి సరసన చేర్చినయట. దేవతలైనా సరే దోసిట తలంబ్రాలు నింపుకోగానే వేయి జన్మల బంధం గుర్తుకొస్తదట.
(పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు)(అన్నమయ్య)
యాంకర్ 6
పెళ్లి సందడిలో అమ్మాయిని చక్కని చుక్క, చందనాల చెక్క అని పొగిడితే అబ్బాయిని మాత్రం పున్నమి రేయి చందమామగా పోల్చుతరు. ఆలనాటి బాలచంద్రుడే దిగి వచ్చినట్టున్నడని మురిపాలు ఒలబోస్తరు. తమ దిష్టే తగులతదా అని చెక్కిళ్లు నొక్కుకుంటరు. ఒక్కగానొక్క కూతురు, లేకలేక పుట్టిన కూతురైనా లేదా ఉమ్మడి కుటుంబంలో పెరిగిన ముద్దల జంటనైనా ఒక్కటి చేసేటపుడు ఆ సందడికి ఆకాశమే హద్దు.
(అలనాటి బాల చంద్రుడి కన్నా అన్నిట సాటి)(మురారి)
యాంకర్ 7
పరిణయం అనగానే ఠక్కున గుర్తొచ్చేది. శ్రీ సీతారాముల కళ్యాణమే.. హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకునే ప్రతి ఒక్కరు ఆ పుణ్యమూర్తుల వివాహ వేడుకనే ఆదర్శం గా తీసుకుంటరు. ఎందుకంటే తన ఇష్ట సఖితో కళ్యాణం కన్నుల పండువగా జరుగుతది. ఆకాశమంత పందిరి..భూదేవంత పీఠ వేసినంత సందడి చేస్తరు. అంతేకాదు.. జరిగే కళ్యాణ వైభోగాన్ని కూడా సీతారామ కళ్యాణంతో వర్ణిస్తరు.
(కళ్యాణ వైబోగమే )(సీతారాముల కళ్యాణం)
యాంకర్ 8
అవును మరి సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతది. మద్యతరగతి ఇండ్లలో అంత వైభవంగా జరుగకున్నా ఉన్న కాస్తలో వేడుకను సంబురంగా జరుపుకుంటరు. జానకి రాములనే ఆదర్శంగా తీసుకుంటరు. జానకి రాముల కళ్యాణానికి జగమే ఊయల ఊగెనట..
(జానకి రాముల కళ్యాణానికి జగమే ఉయల ఊగెనులే..)(సంసారం ఒక చదరంగం)
యాంకర్ 9
పెళ్లంటె మాటలా.. పెళ్లి ముహూర్తానికి ముందే ఎంతో హడావుడి.. ఇంతకు ముందయితే ఆరు రోజుల పెళ్లి జరిగేది. తరువాత అదికాస్తా ముచ్చటగా మూడురోజుల పెండ్లయింది. ఇప్పుడు హై స్పీడ్ కాబట్టి ఒక్కరోజులోనే పెళ్లి అయిందనిపిస్తున్నరు. ఆ ఒక్కరోజు కోసం చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఇదిగో ఈ పాట చూస్తే మీకే తెలుస్తది.
(ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి)(నువ్వు నాకు నచ్చావ్)
యాంకర్ 10
ఎవరింట్లో పెళ్లి జరిగినా ఊరంతా హడావుడి చేస్తరు. ఇప్పుడైతే హడావుడిగా చాప చుట్టేస్తున్నరు గని, ఒక ప్పుడు పెళ్లంటే ఊరంతా సందడే సందడి. కులాలకు మతాలకు అతీతంగా అందరూ తలా ఓ చేయి వేస్తరు. కట్న కానుకలేమీ లేకున్నా చిరునవ్వుల కట్నంతో చిరాయువై వర్ధిల్లమని దీవిస్తరు.
(శ్రీ లక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం)(జస్టిస్ చౌదరి)
యాంకర్ 11
పెళ్లంటే రెండు జీవితాలు మూడు ముళ్లతో, ఏడడుగులతో ఒక్కటయ్యే శుభదినం. ఆ ఏడడుగులు వేసి అరుధతి నక్షత్రం చూపే వరకు అందరూ ఉంటరు.. కానీ కొత్తగా పెళ్లైన జంట పదికాలాల పాటు పండంటి సంసారం చేయాలి.. వారి సంసారం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగటం ఎలాగో ముందే చెప్తరు పెద్దలు..
(పెళ్లిపుస్తకం పాట)(అడుగడుగున తొలిపలకులు గుర్తు చేసుకో దగ్గర్నుంచి)
యాంకర్ 12
పేద మనసుకు పెళ్లంటే అతిధులెవ్వరూ రారమ్మా.. అన్నాడో సినీ కవి.. పెళ్లికి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు కావాలా..ప్రకృతి పరవశించి వీచే చిరుగాలే సన్నాయి పాట… చిగురాకులే తోరణాలు.. సెలయేటి గలగలలే వేద మంత్రాలు.. ఏకాంతంలో ఒక్కటయ్యే జంటలకు దశదిశలే పెండ్లి పెద్దలు.. ఇట్లాంటి పెండ్లిని గంధర్వ వివాహం అంటరు.. రెండు మనసులు ఒక్కటవ్వాలంటే మాటే మంత్రము.. ఆ మంత్రానికి మనసే బంధము..
(మాటే మంత్రము)( సీతా కోక చిలుక)
యాంకర్ 13
వేద మంత్రాల సాక్షిగా వేసిన మూడు ముళ్లు, ఏడడుగుల బంధం అరవై ఏండ్ల పండంటి సంసారంగా సాగిందా ఇక ఆ జంట పుణ్య దంపతులన్నట్టే.. ఆ దాపత్య ఫలంగా వచ్చిన కొత్త జనరేషనంతా ఈ వృద్దదంపతులకు షష్టి పూర్తి చేస్తరు.. షష్టిపూర్తి అంటే దాదాపు పెళ్లి చేసినంత హడావుడి చేస్తరు.
(సీతారామయ్య గారి మనమరాలు)(షష్టి పూర్తి పాట)
ఎండ్ యాకర్
ఇదీ ఈ వారం సుమధుర స్వరాల పల్లకి ప్రియరాగాల సందడి.. మరో మంచి కాన్సెప్ట్ తో ... మరికొన్ని స్వరసోయగాలతో వచ్చేవారం కలుద్దాం. దిసీజ్ ప్రవళిక సైనింగ్ ఆఫ్..